మున్సిపాలిటీలో శిలాపలకం వివాదం…!!

మున్సిపాలిటీలో శిలాపలకం వివాదం…!!

ప్రారంభోత్సవానికి ముందే తొలగింపు…!!

రసాభాసగా కొనసాగిన మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు మున్సిపాలిటీ పాలకవర్గం శిలాపలకం ప్రారంభోత్సవానికి ముందే వివాదం నెలకొంది.సోమవారం ప్రారంభించాల్సిన శిలాపలకంలో పేర్ల గందరగోళం బయటపడడంతో మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించడం జరిగింది.కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు శిలాపలకంలో లేకపోవడం, మరికొంతమంది పేర్లు తప్పుగా ముద్రించబడినట్లు గుర్తించడంతో ఈ వివాదం చెలరేగింది. నందికొట్కూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాపలకం ప్రారంభోత్సవానికి ముందే తొలగించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పేర్లు లేకపోవడంపై కొంతమంది కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల17వ తేదీతో ప్రస్తుత కౌన్సిలర్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో చివరి రోజుల్లోనే ఈ వివాదం తలెత్తడం విశేషంగా మారింది. పురపాలక సంఘం పాలకవర్గం శిలాపలకంలో ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు లేకపోవాలి అనే అంశంపై అధికార పార్టీ లోపలే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.అధికారులు తొందరపాటుగా శిలాపలకం తయారు చేయడంతో తప్పులు జరిగాయని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయ ఒత్తిళ్ల మధ్య మున్సిపల్ అధికారులు శిలాపలకాన్ని తొలగించినట్లు సమాచారం.

ఈ ఘటనతో మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం శిలాపలకాన్ని సవరించి మళ్లీ ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అయితే శిలాపలకం మళ్లీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నందికొట్కూరు పట్టణ ప్రజల్లోనూ ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply