ఉరుకుంద దేవస్థానంలో ఒకే అధికారి దీర్ఘకాల సేవలు..
ఉరుకుంద దేవస్థానంలో ఒకే అధికారి దీర్ఘకాల సేవలు..
స్థానికుల్లో చర్చ
కౌతాళం, ఆంధ్రప్రభ: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో ఒక అధికారి దాదాపు 25 ఏళ్లుగా వివిధ దశల్లో విధులు నిర్వహిస్తున్నారనే అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో సాధారణంగా బదిలీలు, పదోన్నతులు, పరిపాలనా మార్పులు జరుగుతుంటే, ఈ దేవస్థానంలో మాత్రం ఒకే అధికారి దీర్ఘకాలంగా కొనసాగుతున్నారంటూ స్థానికులు, కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికంగా ఆయనను “ఫెవికాల్ వీరుడు”గా పిలుస్తూ, గతంలో బదిలీలు జరిగినప్పటికీ తిరిగి అదే దేవస్థానంలో విధులు చేపట్టారని కొందరు పేర్కొంటున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే అధికారులతో సమన్వయం పెంచుకుని దేవస్థాన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో, ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. ఆరోపణలకు సంబంధించి సంబంధిత అధికారి లేదా దేవాదాయ శాఖ స్పందన అందుబాటులోకి రాలేదు.
దేవస్థాన పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరగాలంటే దీర్ఘకాలిక నియామకాల అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించాలని కొందరు భక్తులు కోరుతున్నారు. ఒకే చోట సుదీర్ఘ కాలం విధులు నిర్వహించడానికి గల పరిపాలనా కారణాలు ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ అంశంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
