ఉరి తాళ్లతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు..

ఉరి తాళ్లతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు..
రైతుల వినూత్న ఆందోళన
ఇచ్చోడ ఆంధ్రప్రభ: వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే రైతులపై తీవ్ర భారం పడుతుందని ఆరోపిస్తూ ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామానికి చెందిన రైతులు శనివారం వినూత్న నిరసన చేపట్టారు.
గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద చేతుల్లో ఉరి తాళ్లు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే తమకు చావే దిక్కవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదనలను వ్యతిరేకించారని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోందనే అనుమానం తమకు కలుగుతోందని అన్నారు. ఒకవేళ మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయ వ్యయాలు పెరిగి రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, రైతు భరోసా అందరికీ చేరలేదని, పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే మరింత ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు దత్త, మారోతి, ప్రలాద్, వెంకటి, తులసిరామ్, తిరుపతి, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.
