రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం..
- నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రారంభించి రైతులకు విత్తనాల బస్తాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ముంగిటకే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు, ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలను సాగు చేయాలని, తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యాంసుందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
