అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు

విట్టాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

కుంటాల, ఆంధ్రప్రభ: ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. పైలెట్ గ్రామంగా జిల్లా అధికారులు విట్టాపూర్‌ను ఎంపిక చేయగా, గ్రామానికి 52 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 22 ఇళ్లు పూర్తి కావడంతో లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముధోల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రెండో విడతలోనూ అర్హులైన లబ్ధిదారులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందిస్తామని చెప్పి మోసం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని చెప్పారు.

ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రితో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. తిమ్మాపూర్ నుంచి ఓలా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.62 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.352 కోట్లు మంజూరయ్యాయని, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో శోభన, స్థానిక సర్పంచ్ సిందే లింగారం పటేల్, హౌసింగ్ ఏఈ శైలజ, స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీ ఆప్కా గజ్జరం యాదవ్, జీవి రమణారావు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.