మేడ్చల్ కాంగ్రెస్‌లో విభేదాలకు తెర..

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో గత కొద్దిరోజులుగా నెలకొన్న విభేదాలు ఎట్టకేలకు సద్దుమరిగాయి. మేడ్చల్ డివిజన్ అధ్యక్ష పదవి వివాదంతో తీవ్ర అసంతృప్తికి లోనై, పార్టీకి రాజీనామా చేసిన స్థానిక కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు శాంతించారు. శనివారం రోజు జరిగిన కీలక పరిణామాల అనంతరం వారు తమ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపారు.

మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. వివాదాన్ని సద్దుమణిగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత నక్క ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అసంతృప్తితో ఉన్న నాయకులతో ఆయన జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరడంతో అసంతృప్త నేతలు మెత్తబడ్డారు.

గుండ్లపోచంపల్లి మాజీ డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈ సంక్షోభానికి అధికారికంగా తెరపడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత పరిణామాల వల్ల కొంత అసంతృప్తి చెందినా, చివరకు పార్టీ ప్రయోజనాల కోసమే కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. సీనియర్ల సమక్షంలో జరిగిన ఈ చర్చలతో విభేదాలన్నీ పటాపంచలయ్యాయని, ఇకపై మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని క్యాడర్ హర్షం వ్యక్తం చేసింది.