Monsoons | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక
Monsoons | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక
నేటి నుంచి వాతావరణంలో భారీ మార్పులు
పిడుగులు, ఉరుములతో వానలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Monsoons | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మరోసారి పూర్తిగా మారబోతోంది. రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటివరకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురవగా, నేటి నుంచి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఇక తెలంగాణలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉండనుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్‌లో పగటిపూట సాధారణ వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
