అబద్ధాల పునాదులపై పుట్టిందే గొడ్డలి పార్టీ
మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు
అభివృద్ధిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : అబద్ధాలు, అసత్య ప్రచారంతో రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని, అలాంటి పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డికి మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ పర్యటనను జగన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జగన్‌రెడ్డి మరోసారి నిరాశపరిచారని తెలిపారు.
విశాఖ సముద్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన బాధాకరమని మంత్రి తెలిపారు. అయితే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు ప్రారంభించిందన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు.
విశాఖ తీరంలో ప్రమాదం జరిగిన ప్రదేశం 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉండగా, దానిని 10 కిలోమీటర్లలోపే జరిగిందని జగన్‌రెడ్డి చెప్పడం ఆయనకు ప్రాథమిక అవగాహన కూడా లేదనే విషయాన్ని బయటపెడుతోందన్నారు. నాటికల్ మైల్స్, కిలోమీటర్ల మధ్య తేడా తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా సముద్రంలో వేటకు వెళ్లిన 277 మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయినా, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు మత్స్యకారులపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. విశాఖ ఘటనలో బాధితుల ఆచూకీపై స్పష్టత రాకముందే కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించిందన్నారు. ఆ సహాయాన్ని కూడా ‘ముష్టి’గా అభివర్ణించడం ప్రజల బాధలను అవమానించడమేనని విమర్శించారు .
ప్రతి మత్స్యకార పడవకు ట్రాన్స్పాండర్లు అమర్చి, అత్యవసర పరిస్థితుల్లో అలారం బటన్ నొక్కగానే ప్రభుత్వానికి సమాచారం చేరే విధంగా ఆధునిక వ్యవస్థను అమలు చేశామని మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో పడవలో ఉన్న వ్యక్తులు ట్రాన్స్‌పాండర్ స్విచ్ నొక్కకపోవడం వలన ఆచూకి లబించలేదని తెలిపారు. ఘటన జరిగిన రోజు తనకు కంటి శస్త్రచికిత్స జరగటంతో స్వయంగా వెళ్లలేకపోయినా, వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను పంపించి పరిస్థితిని పర్యవేక్షించామని చెప్పారు.
మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో మత్స్యకార భరోసా పథకం కింద .531 కోట్ల రూపాయిలు మాత్రమే ఖర్చు చేయగా, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే .511 కోట్లు మత్స్యకారులకు అందచేసామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త బోట్లు, వలలు, తెప్పల పంపిణీ కార్యక్రమాలను పునఃప్రారంభించామని వివరించారు .
మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ, సీసీ కెమెరా దృశ్యాలతో నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ప్రమాదాలు ఆకశ్మాత్తుగా జరుగుతాయి, కానీ ప్రమాదం జరిగిన వెంటనే బాధితున్ని వెంటనే హస్పిటల్ కు తరలించకుండా, తన కొడుకును కాపాడుకునేందుకు వేరే వ్యక్తి యాక్సిడెంట్ చేసేనట్లు చిత్రికరించేందుకు ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కుటీల మనస్తత్వం ఏంటో బయటపడిందని అన్నారు. సమయానికి బాధితుడిని హస్పిటల్ కు తరలించి ఉంటే అతను బ్రతికే అవకాశం ఉండేదని, చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, ఈ వ్యవహారంలోనూ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్‌రెడ్డితో ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. ప్రత్యక్షంగా అయినా, ఆన్లైన్లో అయినా ప్రజల ముందే వాస్తవాలు వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక ఫలించవని, ప్రజలు ఇప్పటికే వైసీపీ నిజస్వరూపాన్ని గుర్తించారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
