Lenin |ఆ ఒక్క మాటతోనే ‘వసంత్’ పాత్ర చేశా..

‘లెనిన్’ నటుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో వసంత్ పాత్ర పోషించిన నటుడు తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దర్శకుడు కిషోర్ అబ్బూరు తనకు కథ చెప్పిన క్షణం నుంచి ఆ పాత్రతో ఏర్పడిన అనుబంధాన్ని భావోద్వేగంగా వివరించారు.

“‘లెనిన్’ సినిమాలోని వసంత్ పాత్ర చిత్రణ, దర్శకుడు కిషోర్ అబ్బూరు నుంచి కథ విన్నప్పుడు నన్ను ఎంతగానో కదిలించింది. కథలో ఈ పాత్ర గ్రాఫ్, ప్రభావం చాలా బలంగా ఉన్నాయి. మొదట ఈ పాత్ర చేయగలనో లేదో అనే సందేహం నాలో ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ విలన్ పాత్ర చేయలేదు” అని తెలిపారు.

అయితే, దర్శకుడు కిషోర్ అబ్బూరు తన సందేహాన్ని తొలగించారని చెప్పారు. “అది విలన్ పాత్ర కాదు బ్రో.. నువ్వు నా కథకు యాంటీ-హీరో అవుతావు” అని దర్శకుడు చెప్పిన మాటలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని వెల్లడించారు.

ఆ సంభాషణ తర్వాత ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని, “నాకు నా వసంత్ దొరికాడు” అనే ఆనందం దర్శకుడి కళ్లలో కనిపించిందని పేర్కొన్నారు. ఆ క్షణం తన నట జీవితంలో మరపురానిదిగా నిలిచిపోయిందని చెప్పారు.

వసంత్ పాత్రతో తన ప్రయాణం ప్రారంభమైందని, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ తన హృదయాన్ని నింపుతోందని భావోద్వేగంగా తెలిపారు. అలాగే నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, నాగ్ సార్, అఖిల్ బ్రదర్కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నటుడి నిజాయితీ, పాత్రపై ఆయనకున్న అంకితభావాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.