వాన కోసం రైతుల పాదయాత్ర
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: వర్షాలు కురిసి పంటలు కాపాడాలని కోరుతూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల రైతులు, గ్రామస్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖండేబల్లూర్ గ్రామం నుంచి సావర్‌గాం గుట్టపై కొలువై ఉన్న శ్రీరాముడి ఆలయం వరకు భజన కీర్తనలతో పాదయాత్ర చేపట్టి, జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వర్షాకాలం ప్రారంభంలో కురిసిన స్వల్ప వర్షాలతో జుక్కల్ మండల రైతులు వేలాది ఎకరాల్లో పెసర, మినుము, కంది, పత్తి, సోయాబీన్ పంటలను సాగు చేశారు. అయితే పంటలు నాటిన తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన ఎండలు, ఈదురుగాలుల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో ఖండేబల్లూర్ గ్రామానికి చెందిన రైతులు, మహిళలు, భక్తులు మంగళవారం ఖండేబల్లూర్ నుంచి సావర్‌గాం గుట్టలోని శ్రీరాముడి ఆలయం వరకు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. ఆలయంలో శ్రీరాముడికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంటపాటు భజన కీర్తనలు నిర్వహిస్తూ వర్షాలు కురవాలని ప్రార్థించారు.
పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని, సాగు నీరు, తాగునీరు, పశువులకు మేత, తాగునీటి కొరత లేకుండా వరుణదేవుడు కరుణించాలని భక్తులు శ్రీరాముడిని వేడుకున్నారు.
