వాటర్ ప్లాంట్ ఉంది.. కానీ నీళ్లు లేవు..
తిమ్మాపూర్ లో తాగునీటి కష్టాలు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ తరచూ మరమ్మతుల పేరుతో మూతపడుతుండటంతో గ్రామస్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామంలో గతంలో దొరగా కొనసాగిన వ్యక్తి కుటుంబ సభ్యులు వాటర్ ప్లాంట్ను నిర్మించి గ్రామానికి బహుమతిగా అందించినప్పటికీ, దానిని గ్రామపంచాయతీ ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదు. దీంతో ప్లాంట్ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనే కొనసాగుతోంది. ఈ కారణంగా తరచూ మరమ్మతుల పేరుతో ప్లాంట్ రోజుల తరబడి పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.
పరిస్థితి మరింత విషమించడంతో పక్కనే ఉన్న కేశవాపూర్ గ్రామం నుంచి తాగునీటిని కొనుగోలు చేసి వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది. వాటర్ ప్లాంట్ పనిచేయకపోయినా ఎవరిని ప్రశ్నించాలో తెలియని పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీని నిలదీస్తే ప్లాంట్ తమ ఆధీనంలో లేదని, ప్రైవేటు నిర్వాహకులను ప్రశ్నించే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.
ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణపై కూడా గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి శుద్ధి ప్రక్రియలో రసాయనాల వినియోగంలో లోపాలు జరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా వాటర్ ప్లాంట్ను గ్రామపంచాయతీ స్వాధీనం చేసుకుని, నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
