పీఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి
ఫ్యాప్టో ఆధ్వర్యంలో చిత్తూరులో భారీ ర్యాలీ..
కలెక్టరేట్ ఎదుట పికెటింగ్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం చిత్తూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట పికెటింగ్ చేపట్టారు.
పీవీకేఎన్ కళాశాల ప్రాంగణం నుంచి ఉదయం 10 గంటలకు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎన్. మణిగండన్, ప్రధాన కార్యదర్శి జి. మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్ర పరిశీలకులు నరోత్తం రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు నినాదాలతో కలెక్టరేట్‌కు చేరుకుని తమ డిమాండ్లకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2023 జూలై నుంచి అమలులోకి రావాల్సిన 12వ పీఆర్సీ కోసం వెంటనే కమిటీ చైర్మన్‌ను నియమించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2022 నుంచి చెల్లించాల్సిన సరెండర్ లీవ్ నగదీకరణ బకాయిలను వెంటనే చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా జేఏసీ చైర్మన్ కె.వి. రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఆందోళన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. మోహన్ కుమార్‌కు ఫ్యాప్టో జిల్లా నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యాప్టో నాయకులు జి.వి. రమణ, గంటా మోహన్, జిల్లా కో-చైర్మన్లు రామమూర్తి, అరుణ్ కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆర్. మదన్మోహన్ రెడ్డి, చలపతిరావు, పీహెచ్ జగదీష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రెడ్డప్ప నాయుడు, సురేష్, గిరి యాదవ్, ఇలియాస్ బాషా, ముక్తార్ అహ్మద్, సీనియర్ నాయకులు చంగల్రాయ, ముందడి చిట్టిబాబు, సోమశేఖర్ నాయుడు, దీనావతి, యువరాజు, పురుషోత్తం, రహనా బేగం, దేవరాజులు, ఎస్పీ బాషా, ఏకాంబరం, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
