Ministers | శరవేగంగా సిక్కోలు అభివృద్ధి

Ministers | శరవేగంగా సిక్కోలు అభివృద్ధి
- పోర్ట్, రైల్వే, విమానాశ్రయ నిర్మాణంతో పరుగులు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- తిలారు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపూర్ – విశాఖ హాల్టును ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : రవాణా మార్గాలు పెంచడం ద్వారానే శ్రీకాకుళం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని తిలారు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపూర్ విశాఖ బ్రహ్మపూర్ (18525/18526) ఎక్స్‌ప్రెస్ నూతన హాల్టును మంత్రి అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులతో కలసి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో అతిథులతో కలసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రైల్వే విషయంలో అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న రామ్మోహన్ నాయుడును మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఇదే సందర్భంలో భవిష్యత్ అవసరాలను తీర్చే దిశగా నూతన ప్రాజెక్టులను తీసుకురావాలని కోరారు.

రైల్వేలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అండర్ పాస్‌ల విషయంలో స్థానిక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వర్షాలు వస్తున్న సమయంలో ఈ ఇబ్బందులు రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రైల్వే అధికారులు చొరవ చూపాలని కోరారు. శ్రీకాకుళం లో రైల్వే అభివృద్ధి కోసం ఆనాడు ఎర్రంనాయుడు విశేష కృషి చేశారని, అనేక నూతన సర్వీసుల ప్రారంభం, హాల్టుల కేటాయింపు జరిగాయని గుర్తు చేశారు. అదే పంథాను కొనసాగిస్తున్న రామ్మోహన్ నాయుడు.. ఇప్పటికే అనేక నూతన సర్వీసులను, హాల్టులను ఇటీవల కాలంలో ఏర్పాటు చేయించారని అన్నారు. కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, తిలారు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో సమీప భవిష్యత్‌లో రెండు మూడైనా సర్వీసులు ఆగేలా చొరవ చూపాలని రామ్మోహన్ నాయుడును కోరారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తిలారులో పరిసర ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతం అయ్యేలా మరో సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు కింజరాపు ఎర్రంనాయుడు అని అన్నారు. దూసి మొదలుకొని, ఇచ్చాపురం వరకూ ప్రతీ స్టేషన్‌లో ఆయన అభివృద్ధి మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని, పట్టుబట్టి అభివృద్ధి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు తాను కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తిలారులో ఇప్పటికే నూతన భవనం, ప్లాట్ ఫాం హైట్, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు, నూతన హాల్టుల కేటాయింపు.. ఇలా వరుసపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.

తిలారు రైల్వే స్టేషన్‌ను మరింత అందంగా తయారు చేస్తామని, అప్రోచ్ రోడ్, అదనపు షాపులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
తిలారుతో పాటు హరిశ్చంద్రపురం స్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇప్పటికే రైల్వే అధికారులకు ఈ స్టేషన్ పరిస్థితులు వివరించామని, ఉత్తరాంధ్రలోనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ హరిశ్చంద్రపురంను అభివృద్ధి చేస్తే.. పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఇప్పటికే స్టేషన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయింపు చేశామని, కొత్త హాల్టుల మంజూరు కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు గుర్తు చేశారు.
అండర్ పాస్ ల సమస్య దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉందని, రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టిలో సమస్య ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఆశపడి వేసుకున్న అండర్ పాసులు.. వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులను రెట్టింపు చేస్తున్న విషయాన్ని పదే పదే పార్లమెంట్‌లో గుర్తు చేసినట్టు స్పష్ట చేశారు. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
కోటబొమ్మాలి రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను కూడా హాల్టును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ అదనపు స్టాపులను మంజూరు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం అభివృధికి, తాను, బాబాయ్ అచ్చెన్నాయుడు కట్టుబడి ఉన్నామని తెలిపిన రామ్మోహన్ నాయుడు అనేక కీలక ప్రాజెక్టులు సమీప భవిష్యత్ లో అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
మూలపేట పోర్టు ద్వారా సిక్కోలు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని, తన శాఖ తరపున శ్రీకాకుళం జిల్లాలో ఓ విమానాశ్రయం నిర్మాణం వైపు కూడా వేగంగా అడుగులు వేస్తున్నామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. పోర్టు, హైవే, ఎయిర్ పోర్ట్ ఇవన్నీ మన జిల్లాలో ఏర్పాటు చేసుకుంటే.. వలసల ప్రాంతం అన్న పేరును చేరుపుకుని.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుండి, దేశంలో వివిధ రాష్ట్రాల నుండి, విదేశాల నుండి సైతం మన జిల్లాకు వలస వచ్చేందుకు ఆమోదయోగ్యంగా సిక్కోలును అభివృద్ధి చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సహకారంతో ఈ లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తామని తెలిపారు.
బాబు వెంట అచ్చెన్న.. మోదీ బాటలో నేను..
అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్న శ్రీకాకుళం కోసం అహర్నిశలు తాను, బాబాయ్ అచ్చెన్నాయుడులు కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా.. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కీలక వ్యక్తిగా.. రాష్ట్రంలో సుపరిపాలన ప్రజలకు అందే వ్యక్తుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి కింజరాపు అచ్చెన్నాయుడు అని రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు. గతంలో ఎప్పుడూ లేదని, ధాన్యం కొనుగోళ్ళు జరిగిన నాలుగు గంటల్లో చెల్లింపు జరగడం.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అచ్చెన్నాయుడుకు, అయన పనితీరుకు అందరూ అభినందనలు తెలిపాలని అన్నారు. యువత అంటే.. ప్రధాని మోదీకి అమితమైన అభిమానం అని.. ఆ కారణం చేతనే కేంద్ర మంత్రిగా నాకు అవకాశం దక్కిందని గుర్తు చేశారు. కేంద్రంలో అతి చిన్న వయస్సులో మంత్రి వర్గంలో చేరే అవకాశం శ్రీకాకుళం ప్రజల సహకారంతో నాకు దక్కిందని.. మోదీ సహకారంతో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు.
తిలారు రైల్వే స్టేషన్ లో నూతన హాల్టు ప్రారంభోత్సవంలో కూటమి శ్రేణులతో కలసి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం స్టేషన్ అభివృద్ధికి సంబంధించి స్థానికుల నుండి వినతులను స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను రైల్వే అధికారులతో కలసి పరిశీలించి అభివృద్దికి పలు సూచనలు చేశారు.
