Road accident | దంపతుల మృతి

Road accident | దంపతుల మృతి

Road accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కసింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మునగపాక మండలానికి చెందిన ఒకే కుటుంబం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాళ్లపాలెం సమీపానికి రాగానే ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో ఆడారి కూర్మారావు (42), జ్యోతి (31) అనే దంపతులు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఆరుగురిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కసింకోట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply