Cycle Ride | పర్యావరణ పరిరక్షణకు సీఎం చంద్రబాబు సందేశం
Cycle Ride | పర్యావరణ పరిరక్షణకు సీఎం చంద్రబాబు సందేశం
Cycle Ride | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ సవారీ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. సీఎం చేపట్టిన సైకిల్ సవారీ కార్యక్రమం ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై కూడా అవగాహన కల్పించేలా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా విశాఖ నుంచి ఇచ్చిన ఈ సందేశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉందని పేర్కొన్నారు.
ఉదయం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నగర వీధుల్లో సైకిల్‌పై ప్రయాణిస్తూ పర్యావరణ హిత జీవనశైలిని ప్రోత్సహించారు. వాహనాల వినియోగాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు సైకిళ్లను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు గాలి కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు ప్రధాన కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. “కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే కనీసం ఒక్కొక్కరు ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలి. ప్రకృతిని కాపాడటం మనందరి సామాజిక బాధ్యత” అని సీఎం పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పచ్చదనం పెంపు కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
