Srikakulam | మంత్రి అచ్చెన్నాయుడు భరోసా..

Srikakulam | మంత్రి అచ్చెన్నాయుడు భరోసా..
Srikakulam | సంతబొమ్మాళి (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తాళ్లవలస గ్రామంలోని డయేరియా (Diarrhea) బాధితులకు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో ఇటీవల నమోదైన అతిసారం కేసులను స్వయంగా పర్యవేక్షించడానికి మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, వైద్య – ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభావిత రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తక్షణ, శాశ్వత చర్యలకు రూ. 60 లక్షలు మంజూరు..
గ్రామంలో అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు, సురక్షిత తాగునీటి ఏర్పాటు పై అధికారులకు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నామని, టెక్కలి (Tekkali) కేంద్రం నుంచి నీటిని ఇంటింటికి కుళాయి ద్వారా అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీనికిగాను రూ. 60 లక్షలు మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు. అలాగే, అధికారులు సీజనల్ జ్వరాల పై కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ గ్రామంలో ఇలాంటి సమస్య అంతకుముందు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అత్యాధునిక పరీక్షలకు నమూనాలు పంపినట్లు వెల్లడి :
నీటి నాణ్యత పరీక్షల పై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, ఇప్పటికే సేకరించిన నమూనాలలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని తెలిపారు. మరింత ఖచ్చితత్వం కోసం, బ్లడ్ శాంపిల్స్‌తో పాటు, మంచి నీటి నమూనాలను విశాఖపట్నంలోని (Visakhapatnam) అత్యాధునిక లాబరేటరీకి పంపించామని, అక్కడ అడ్వాన్స్‌డ్ టెస్టులు నిర్వహించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకం అని ఉద్ఘాటిస్తూ, డ్రైనేజీ నీరు ఎట్టి పరిస్థితుల్లో చెరువులో కలవరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
