Pawan Kalyan | పవన్ క్షమాపణ చెప్పాలి…
Pawan Kalyan | పవన్ క్షమాపణ చెప్పాలి…
- లేకుంటే తెలంగాణ లో సినిమాలు రిలీజ్ అవ్వవు!
Pawan Kalyan | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలంగాణ వాళ్లకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆయన సినిమాలు తెలంగాణలో రిలీజ్ అవ్వవు అని ఆర్అండ్‌బీ శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తెలంగాణ నాయకుల దిష్టి వల్ల కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి ముక్కలు ఎండిపోయాయంటూ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు తెలంగాణలోని రాజకీయ నాయకులను కించ పరిచినట్లు ఉన్నాయని అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి(Minister Komati Reddy) స్పందించారు. పవన్ కల్యాణ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడనివ్వము అంటూ హెచ్చరించారు.
వివాదాలకు దూరంగా చిరంజీవి..
చిరంజీవి సూపర్ మ్యాన్ అని, ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కానీ పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసి తెలియక మాట్లాడారో కావాలనే మాట్లాడారో తెలియదు కానీ క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల అవ్వవని, సినిమాటో గ్రఫీ(Cinematography) శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని చెప్పారు.
