టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి

రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ చురుకైన పాత్ర
చిత్తూరు టిడిపికి దిశానిర్దేశం కానున్న అమరన్న

చిత్తూరు, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, పలమనేరు శాసనసభ్యులు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డిను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మంత్రి హోదాలో పనిచేసిన అమర్నాథ్ రెడ్డికి ఈ పదవి దక్కడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి అత్యంత కీలకమైనది. పార్టీ నిర్మాణం నుంచి కార్యాచరణ వరకు ప్రతి అంశంలో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈ పదవిదే. అధిష్టానం తీసుకునే నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, కార్యకర్తల సమస్యలను నాయకత్వానికి చేరవేయడం వంటి బాధ్యతలతో ఈ పదవి ఒక వారధిగా నిలుస్తుంది. ముఖ్యంగా నారా లోకేష్ నేతృత్వంలో క్యాడర్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యత మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు విస్తృతమైనవి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, బలహీన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం ఆయన ప్రధాన కర్తవ్యాలు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సమావేశాలను సమన్వయం చేసి పార్టీ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగించేలా చూడాలి. కార్యకర్తలకు ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూసే బాధ్యత కూడా ఈ పదవిలో భాగం.

అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం, ప్రభుత్వ వైఖరిపై పార్టీ అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో కీలకం. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో కూడా కీలక పాత్ర పోషిస్తూ, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి అధిష్టానానికి నివేదికలు సమర్పించాలి. పార్టీ బలోపేతానికి అవసరమైన నియామకాలు, కమిటీలు ఏర్పాటు విషయంలో కూడా సూచనలు చేసే అధికారం ఈ పదవికి ఉంది.

అమర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం బలమైన నేపథ్యంతో సాగింది. ఆయన తండ్రి నూతనకాలువ రామకృష్ణారెడ్డి పుంగనూరు నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్ర వేసిన నాయకుడు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అమర్నాథ్ రెడ్డి కూడా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1985లో గ్రామ స్థాయి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం, సర్పంచ్, మండల అధ్యక్షుడు, జిల్లా నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రి వంటి పలు హోదాలను అందుకుంది. 1996లో పుంగనూరు ఉపఎన్నికలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తరువాత కూడా ప్రజల్లో బలమైన స్థానం సంపాదించారు.

2004లో తిరిగి విజయాన్ని సాధించి తన పట్టును చాటుకున్నారు. అనంతరం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత పలమనేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, అక్కడ ఎక్కువకాలం కొనసాగలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి హోదాలో పనిచేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అమర్నాథ్ రెడ్డి, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు.

2019 ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ పార్టీని వీడకుండా కార్యకర్తలా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో కూడా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ చురుగ్గా వ్యవహరించారు.

ప్రత్యేకంగా నారా లోకేష్ పాదయాత్రలో కీలక పాత్ర పోషించిన ఆయన, జిల్లా సమన్వయకర్తగా పనిచేశారు. లోకేష్‌తో కలిసి గ్రామ గ్రామాన పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అభ్యర్థుల ఎంపికలో కూడా కీలకంగా వ్యవహరించి పార్టీ విజయానికి తోడ్పడ్డారు. అయితే మంత్రి పదవి రాకపోవడంతో కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో ఆయన చురుకుదనం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమైంది. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆయనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా పార్టీ ఆయన సేవలను మళ్లీ రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితో అమర్నాథ్ రెడ్డికి మరింత రాజకీయ బాధ్యతలు పెరిగాయి. అధిష్టానం, క్షేత్రస్థాయి మధ్య వారధిగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన కీలక బాధ్యత ఆయనపై పడింది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి వ్యూహాలు రూపొందించడంలో ఆయన పాత్ర కీలకంగా మారనుంది.

అమర్నాథ్ రెడ్డి నియామకంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో అమరన్నగా గుర్తింపు పొందిన ఆయన మళ్లీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నారు. ఆయన నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు విశ్వసిస్తున్నారు.

మొత్తానికి గ్రామ స్థాయి నాయకుడిగా ప్రారంభమైన అమర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, నిబద్ధతకు నిదర్శనం. ఈ ప్రతిష్టాత్మక పదవితో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎలా రాణిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది

Leave a Reply