తోతాపురి రైతులకు ప్రభుత్వం అండగా..
తోతాపురి రైతులకు ప్రభుత్వం అండగా..
కిలోకు రూ.6 కంటే తక్కువ ధరకు చెక్!
జిల్లాలో పండే ప్రతి తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తాం: కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, ఆంధ్రప్రభ : జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డితో కలిసి రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించిన ఆయన కొనుగోలు ప్రక్రియలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. కిలోకు రూ.6 కంటే తక్కువ ధర రాకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా రైతులతో సమావేశమై భరోసా కల్పించారని చెప్పారు.
పక్వానికి వచ్చిన కాయలనే కోయాలి
రానున్న 10 నుంచి 15 రోజులు తోతాపురి సీజన్‌లో అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు పక్వానికి రాని కాయలను కోయకుండా పూర్తిగా పండిన కాయలను మాత్రమే విక్రయించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల మంచి ధర లభించడంతో పాటు నష్టాలు కూడా తగ్గుతాయని వివరించారు.
ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా టోకెన్ విధానాన్ని అమలు చేయాలని అన్ని యూనిట్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వర్ష ప్రాసెసింగ్ యూనిట్‌లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండటంతో వాహనాల రద్దీ తగ్గిందన్నారు. ప్రస్తుతం యూనిట్‌కు వచ్చే వాహనాలు 6 నుంచి 12 గంటల్లోనే ఖాళీ అయి తిరిగి వెళ్తున్నాయని చెప్పారు.
గత 10 రోజుల్లో వర్ష ప్రాసెసింగ్ యూనిట్ ఒక్కటే 25 వేల టన్నులకు పైగా తోతాపురి మామిడిని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో 2.50 లక్షల టన్నుల దిగుబడి అంచనా
జిల్లాలోని ఇతర యూనిట్ల కొనుగోళ్లతో కలిపి ఇప్పటివరకు 80 వేల నుంచి 90 వేల టన్నుల వరకు మామిడి సేకరణ జరిగిందన్నారు. కోడూరు ప్రాంతంతో కలిపి ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 2.50 లక్షల టన్నుల తోతాపురి దిగుబడి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
జిల్లాలో ఉత్పత్తి అయ్యే ప్రతి తోతాపురి మామిడి కాయను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా కిలోకు రూ.6 కంటే తక్కువ ధర చెల్లిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అలాంటి యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు, వర్ష ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
