ఉపాధి కూలీల ఆగ్రహం.. ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి
ఉపాధి కూలీల ఆగ్రహం.. ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి
నిధులు స్వాహా చేశాడన్న ఆరోపణలతో ఉద్రిక్తత

ఉరవకొండ, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనులకు సంబంధించిన కూలీల వేతనాలు చెల్లించకుండా నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూలీలు దాడి చేసిన ఘటన ఉరవకొండలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లత్తవరం తండాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఇంకుడు గుంతల పనులు చేపట్టారు. అయితే, తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రవి నాయక్ నిధులు స్వాహా చేశాడని ఆరోపిస్తూ కొందరు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఉపాధి హామీ కార్యాలయం వద్ద రవి నాయక్‌పై కూలీలు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
