రాయలసీమకు జలభరోసా.. కీలక ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం

రాయలసీమకు జలభరోసా.. కీలక ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం

సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నిమ్మల రామానాయుడు

కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమకు జీవనాడిగా నిలిచే సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి, తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

కర్నూలు ఎంపీ, జిల్లా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

హంద్రీనీవా కాలువ పనులను తొలి ఏడాదిలోనే పూర్తి చేసి, రికార్డు స్థాయిలో 248 రోజుల పాటు 52 టీఎంసీల నీటిని తరలించినట్లు మంత్రి వెల్లడించారు. ఆ నీటి ద్వారా రాయలసీమ జిల్లాల్లోని రిజర్వాయర్లు, చెరువులు నింపగలిగామని చెప్పారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద 68 చెరువులను నింపేందుకు రూ.228 కోట్లు ఖర్చు చేయగా, 98 శాతం పనులు పూర్తయ్యాయని, ఇప్పటికే 67 చెరువులకు నీరు అందించినట్లు తెలిపారు.

గాజులదిన్నె ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, గేట్ల ఏర్పాటు, నిల్వ సామర్థ్య పెంపు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఒకటని, 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఆలూరు నియోజకవర్గంలోని నగరడోన రిజర్వాయర్‌లో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.

గుండ్రేవుల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు.

ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు ప్రత్యేక మరమ్మతుల ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ స్కీంలోని మోటార్లు దొంగిలించబడినా పట్టించుకోలేదని విమర్శించారు. అలాగే గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ.53 కోట్లతో టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.

శ్రీశైలం ప్లంజ్‌పూల్ మరమ్మతులకు గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, ప్రస్తుతం రూ.203 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. తుంగభద్ర డ్యాంకు ఒక్క సీజన్‌లోనే రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లు అమర్చడం దేశవ్యాప్తంగా అరుదైన రికార్డుగా నిలిచిందని పేర్కొన్నారు.

రాయలసీమలో నీటి కొరతను శాశ్వతంగా అధిగమించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని కీలక సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసి రైతులకు సాగునీటి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.