119 ఫిర్యాదులు.. చట్టపరంగా న్యాయం చేస్తాం

119 ఫిర్యాదులు.. చట్టపరంగా న్యాయం చేస్తాం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ

కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించి, చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు అందాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, భూవివాదాలు, కుటుంబ ఆస్తి తగాదాలు, ఆర్థిక లావాదేవీల వివాదాలు, స్థలాల కొనుగోలు వ్యవహారాల్లో మోసాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా నమోదయ్యాయి.

గోనెగండ్ల మండలానికి చెందిన మహబూబాషా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3.85 లక్షలు తీసుకుని మోసం చేశారని ఫయాజ్ భాషాపై ఫిర్యాదు చేశారు. తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన రంగమ్మ తన 2 ఎకరాల 40 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని న్యాయం కోరారు.

కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన రాముడు ఆస్తి విషయమై కుమారుల వేధింపులపై ఫిర్యాదు చేయగా, కర్నూలు చల్లా స్ట్రీట్‌కు చెందిన ఓ మహిళ బంగారం తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ చర్యలు కోరారు. కోసిగి మండలం కోల్మానుపేటకు చెందిన బసప్ప ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన పొలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎమ్మిగనూరుకు చెందిన వీరేష్‌బాబు ప్లాట్లు విక్రయిస్తామని చెప్పి రూ.30 లక్షలు వసూలు చేసి మోసం చేశారని జయకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరగా, పెద్దకడుబూరుకు చెందిన ఉషారాణి తన తండ్రి మరణించిన తర్వాత తనకు రావాల్సిన ఆస్తిని పెదనాన్న ఇవ్వడం లేదని వినతి సమర్పించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టబద్ధంగా విచారణ జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.