NEET Exam Scam | సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన విషయాలు

NEET Exam Scam | సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన విషయాలు

NEET Exam Scam | నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన
గెస్ పేపర్లతో బయటపడిన అవినీతి బాగోతం
కోచింగ్ సంస్థల కమర్షలైజేషన్‌పై విమర్శలు
ఎన్‌టీఏ నిర్లక్ష్యంపై పెరుగుతున్న ప్రశ్నలు
నీట్ పరీక్షల పారదర్శకతపై నమ్మకం సంక్షోభం

NEET Exam Scam | ప్రశ్నాపత్రాలే గెస్ పేపర్స్ రూపంలో కొందరు అవి నీతిపరులైన ప్రొఫెసర్లు అందజేయటంతో ప్రతిభకు పట్టం కట్టకుండా, అవినీతికి పట్టం కట్టిన విభ్రాంతికర ఉదంతం ‘నీట్’గా బయటకు రావటంతో ‘నీట్’ పరీక్షల నిర్వహణ బండారం బట్టబయలు అయింది. ‘నేషనల్ – ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)’లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తుపై కలలు కంటూ పాల్గొన్నారు. వారి గాలి మేడలు తునాతునకలయినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) మే 12, 2026 నాడు నీట్ పరీక్షను (మే 3 నాడు జరిగింది) రద్దు చేయటంతో తెలిసింది. నిరాశా, నిస్పృహలతో కృంగిపోయిన లేత విద్యార్థులను ఓదార్చటం తల్లిదండ్రులకు సాధ్యం కాలేదు! భారతదేశంలోని పేరెంట్స్ కూడా విషయం తెలియటంతో ‘అయ్యో పాపం!‘ అని తల్లడిల్లిపోయారు!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సంఘటనకు ముందే కామన్ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వాకంలో పిల్లిమొగ్గలు వేసిన దాఖలాలు ఉన్నాయి! ఆ అనుభవాలతో ఆ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం విచారకరం! వారి నిర్లక్ష్య ధోరణి, ఆ శాఖ అధికారులు, మంత్రుల బేఫర్వాతనం వల్ల సంభవించిందని చాలామంది విమర్శిస్తున్నారు. వారిమీద తగు చర్యలు తీసుకోవాలన్న మాట కూడా వినపడుతున్నది. బాధ్యత వేరు – సంస్థను మొదటి నుంచే తగురీతిలో హద్దూ అదుపులో ఉంచటం వేరు. ఇంతకుపూర్వం ఇలాంటి సంఘటనల్లో మంత్రుల రాజీనామా, అధికారుల సస్పెన్షన్‌తో పాటు బాధ్యతను ఫిక్స్ చేయటం వల్ల కొంతకాలం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేవి! ఇప్పుడు సమాజం వింత పోకడలతో ప్రభుత్వాలూ, విపక్షాలూ రాజకీయాల్లో తలమునకలవుతూ ప్రతిదీ పట్టించుకొనే అలవాటును మరిచిపోవటంతో బాధ్యత ఎవరిమీద ఫిక్స్ చేయాలి అనేది జవాబులేని ప్రశ్నగా మారింది!

కీలెరిగి వాతపెట్టే రోజులు మన పెద్దలూ, ప్రభుత్వాలూ, చివరకు ప్రజలూ మర్చిపోయారు! ఇంతకు పూర్వం ప్రభుత్వాలు నిర్వహించే ‘నీట్’లాంటి పరీక్షలలో ఇతర సంస్థల పోటీ సహజంగా ఉండదు! ఇప్పుడు – కోచింగ్ సంస్థలే – ఈ పరీక్షల కోసం విద్యార్థులను తయారుచేసి సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి తమ సంస్థల్లో కోచింగ్ పొందిన విద్యార్థులు అర్హతతో నిమిత్తం లేకుండా మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యే శ్రమను కాసుల సంపాదనలో మునిగి తేలుతూ తీసుకుంటున్నారు! విద్యార్థులకు ప్రతిభలో పోటీ కాదు! ‘నీట్’ పరీక్ష ప్రైవేట్ కోచింగ్ సంస్థల పోటీగా మారింది! ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాంకుల రాబడి కమర్షలైజ్ అయింది!

కోచింగ్ హబ్ నిర్వాకం సాక్ష్యాలు ప్రస్ఫుటంగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి! నిందితులను అరెస్టు చేసేదాకా పరిస్థితులు దారితీశాయి! పరీక్షలు రద్దు కావటంతో దర్యాప్తు సీబీఐకి అప్పచెప్పి నిగ్గు తేల్చమన్నారు! దర్యాప్తులో ఒక ‘గెస్ పేపర్‘ ఉదంతం బయటకు వచ్చింది! ఎన్నో ప్రశ్నలు విద్యార్థులకు సహాయపడేందుకు తయారు చేసిన గెస్ పేపర్వి అసలు పేపర్లోని ప్రశ్నలూ మ్యాచ్ అవటంతో పరీక్షా పత్రాలు లీక్ చేసింది ఎవరు అన్న దర్యాప్తు మొదలయింది! ముఖ్యంగా కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు యథాతథంగా గెస్ పేపర్లలో చోటుచేసుకున్నాయి! క్వశ్చన్ పేపర్లు రాజస్థాన్‌లోని కోచింగ్ హబ్‌లకు చేరటం దాదాపు ఒక నెలకు ముందే జరిగిందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది! పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకొని ప్రశ్నాపత్రాలు అమ్మటం జరిగిందని కూడా విచారణలో తేటతెల్లమైంది!

రాజస్థాన్ పోలీసులు కూడా విచారించి దాదాపు 15 మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే విషయం బయటపడుతుండగానే ఎన్.టి.ఏ పరీక్షలు విద్యార్థుల ఇంటరెస్టు కోరి, నేషనల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద నమ్మకం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయటం జరిగిందని ప్రకటించారు. నిజంగా ఎన్.టి.ఏ మీద విశ్వాసం ఎవరికుంది? అసలు నీట్ ఫార్మాట్‌ను చాలా రాష్ట్రాలు ఒప్పుకోలేదు. అయినా లెక్కచేయకుండా ‘నీట్’ సిస్టమ్‌ను అమలుచేయటం జరిగింది.

2019లో ఇంపర్సనేషన్ స్కాం, తమిళనాడులో విద్యార్థులు ఒకరిబదులు మరొకరు పరీక్షలు రాయటం, కేరళలో పరీక్ష రాసే విద్యార్థినులను నఖశిఖ పర్యంతం చెక్ చేయటం వంటి సంఘటనలు జరిగినా, 2024లో పేపర్ లీక్, గ్రేస్ మార్కుల వివాదం తలెత్తినా నీట్ యథాతథంగా నిర్వహించబడింది! కఠిన విచారణ చర్యల దాఖలాలే లేవు!

రాధాకృష్ణన్ కమిటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు చేసింది! ఎన్‌టీఏ మొత్తాన్ని రిస్ట్రక్చర్ చేయాలన్నది ప్రాథమిక సూచన! అంతేకాదు జిల్లా, రాష్ట్రాల అధికార యంత్రాంగాల సహకారంతో సెక్యూర్ అడ్మినిస్ట్రేటివ్ విధానం ప్రవేశపెట్టాలని కోరింది. మల్టీ స్టేజ్ టెస్టింగ్‌తో పాటు మాల్ ప్రాక్టీసులను అరికట్టేందుకు చాలా విధానాలను కమిటీ రికమెండ్ చేసింది! అలాంటి చర్యలు తలపెట్టకుండా ఎన్‌టీఏ నీట్‌ను మళ్లీ నిర్వహిస్తే పరీక్ష మీద పూర్తిగా నమ్మకం అడుగంటుతుంది!

మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఒక విధమైన స్టాండర్డ్ ఉండేందుకు దేశం అంతటా నీట్ ప్రవేశపెట్టబడింది! నీట్ పరీక్ష విధానం ట్రాన్స్పరెంట్‌గా ఉండాలని కూడా అభిలషించింది. కానీ పరీక్షను నిర్వహించిన తీరుతో మొత్తం నమ్మకం నీరుకారిపోయింది!

అవినీతి వ్యవహారంలో ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఒక బయాలజీ ప్రొఫెసర్‌ను కీలక పాత్రధారులని సీబీఐ గుర్తించింది. వారిని అరెస్టు చేయటమే కాకుండా, ఇంకొన్ని కీలకమైన ఆధారాలు కూడా సేకరించింది. వీళ్ల ఇండ్లు వెతికినప్పుడు పరీక్షలకు సంబంధించిన సాక్ష్యాలు దొరకటం విశేషం! ముందు ముందు మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ మళ్లీ నిర్వహించబోయే పరీక్షను ఇదే సంస్థ ఏవిధంగా లొసుగులు లేకుండా, అక్రమాలకు తావులేకుండా నిర్వహించగలదన్న సందేహం అందర్నీ తొలుస్తున్నది.

విద్యార్థులు, బాగా రాసినవారు నిరాశతో కృంగిపోతున్నారు! మళ్లీ పరీక్ష రాయటం అనేది వారి ఓర్పుకు పరీక్షగా మారింది. పరీక్షలు బాగా వ్రాసి ఎవరో తప్పుచేస్తే లక్షల మంది శిక్ష అనుభవించే పరిస్థితి తలెత్తదని గ్యారంటీ నిర్మాణాత్మకంగా ఇప్పటివరకు వచ్చిన సూచనలు లేవు! అది విద్యార్థుల పేరెంట్స్‌తో పాటు అన్ని రాష్ట్రాల వారిని, చివరకు కేంద్రానికి కూడా సమస్యగా మారిన మాట నిజం. ఫూల్‌ప్రూఫ్ విధానంతో ప్రభుత్వం రాబోయే నీట్ పరీక్షను రూపొందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. త్వరితగతిలో ప్రభుత్వ విధానం తేటతెల్లం కావచ్చు!

నీట్ పరీక్షను అటుంచితే రాష్ట్రాలలోని విద్యా విధానం అనేక విమర్శలను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎమ్సెట్ ఇతర పోటీ పరీక్షల నిర్వహణను, కుక్క గొడుగుల్లా మొలిచిన ప్రైవేట్ విద్యా సంస్థలు సవాలు చేస్తున్నాయి! కోచింగ్ పేరుతో పెద్ద మొత్తాలు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ, కోచింగ్ తీసుకుంటున్న పిల్లలను చదువు పేరుతో రాచిరంపాన పెడుతూ, ఏదో విధంగా ర్యాంకులు తామే దక్కించుకోవాలని ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ మీడియా ప్రకటనలతో చిరాకు తెప్పించటమే కాకుండా కొన్ని సంస్థలు మాల్ ప్రాక్టీసులు చేయటానికి కూడా సిద్ధపడుతున్నాయనే అపవాదును తలకెత్తుకోవటం దురదృష్టకరం!

ప్రైవేట్ విద్యా సంస్థల దుందుడుకు తనాన్ని, ధన వ్యామోహాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది! నీట్ వ్యవహారం లాంటిది జరగకమునుపే ప్రభుత్వాలు అత్యవసర ముందుజాగ్రత్త చర్యలు పోటీ పరీక్షల నిర్వహణల్లో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిన మాట నిజం! పరీక్షలు ప్రహసనాలుగా మారకూడదు.

రావులపాటి సీతారాంరావు

Leave a Reply