జయశంకర్ సార్ ఆశయ సాధనే నిజమైన నివాళి..

జయశంకర్ సార్ ఆశయ సాధనే నిజమైన నివాళి..

  • న్యూజెర్సీలో జరిగిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సభ
  • హాజరైన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన సంస్మరణ సభకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన విశేష కృషిని స్మరించుకున్నారు.

సభలో దయాకర్ రావు మాట్లాడుతూ, జయశంకర్ సార్ తనకు గురువులాంటి వారని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఉండేలా మార్గనిర్దేశం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడంలో తాను కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు.

తనతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా సంతకాలు చేసినప్పటికీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అప్పట్లో సంతకం చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జయశంకర్ సార్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

తెలంగాణ ప్రజలకు కీలక పదవులు దక్కని సమయంలో అసెంబ్లీలో తెలంగాణ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా తాను నిలిచానని దయాకర్ రావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అయిందని, పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని తెలిపారు.

రైతుబంధు వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్న కేసీఆర్ పాలనతో పోలిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రైతులకు తగిన మద్దతు అందించడం లేదని విమర్శిస్తూ, ప్రజలు తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ సంస్మరణ సభకు ఆహ్వానించి పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ సార్ వంటి మహనీయుడి సంస్మరణ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.