ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో ధర్మాన చెరువు సుందరీ కరణ పనులకు సోమవారం ఉదయం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ,కూటమి నాయకులతో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. 2.78 కోట్ల రూపాయలతో ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు అమృత స్కీమ్ కింద నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. ఈ పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టింది.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ను ఆహ్లాదకరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే మచిలీపట్నంలో సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నామన్నారు ధర్మాన చెరువును అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని బందరు ఐకాన్ గా తీర్చిదిద్దుతామన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మధ్యలో డాల్ఫిన్ మౌంటైన్ ఏర్పాటు చేసి బందర్ లోనే అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
