“మలేరియా నివారణ మన చేతుల్లోనే”…

“మలేరియా నివారణ మన చేతుల్లోనే”…
అవగాహనతోనే రోగాలపై గెలుపు
కర్నూలు, ఆంధ్రప్రభ : మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ పూర్తిగా మన చేతుల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనేక ప్రాణాపాయ రోగాల నుంచి రక్షించుకోవచ్చని కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. సింధియా శుభప్రద తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో దిన్నదేవరపాడు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్‌గా డా. ప్రసన్న రాణి వ్యవహరించారు. గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులకు మలేరియా వ్యాధి, దోమల నియంత్రణపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. సింధియా శుభప్రద మాట్లాడుతూ, 2026 సంవత్సరానికి నిర్దేశించిన “మలేరియా అంతానికి నడుం బిగిద్దాం… ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు మనం చేయాలి” అనే థీమ్‌ను వివరించారు.
దోమకాటు నుంచి రక్షణ, దోమల నియంత్రణ ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. దోమల నివారణకు నిల్వ నీటిని తొలగించడం అత్యంత ముఖ్యమని సూచించారు. ఇంటి వద్ద నీటి తొట్టెలను ప్రతి శుక్రవారం శుభ్రం చేసి పూర్తిగా ఎండబెట్టిన తరువాత మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే వీధుల్లో ఉన్న కొబ్బరి చెక్కలు, ఖాళీ సీసాలు, పాడైన టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తక్షణ చికిత్స ప్రారంభించాలన్నారు.
కమ్యూనిటీ మెడిసిన్ దత్తత గ్రామమైన దిన్నదేవరపాడులో ఎఫ్‌ఏపీ కార్యక్రమం కింద మెడికల్ విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదే కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మలేరియాపై నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. పుష్పలత, డా. వైష్ణవి, సీనియర్ రెసిడెంట్లు డా. యాస్మిన్, డా. బ్రయాన్, లెక్చరర్ సురేష్ కుమార్, పీజీ వైద్యులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తంగా, మలేరియా నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
