కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం


కర్నూలు–బెంగళూరు సూపర్ లగ్జరీ బస్సు లారీని ఢీకొని ఇద్దరి దుర్మరణం.
డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు మృతి..
పలువురికి తీవ్ర గాయాలు.. చిక్కబళ్లాపూర్ వద్ద అర్ధరాత్రి ఘటన

కర్నూలు, ఆంధ్రప్రభ: కర్నూలు-బెంగళూరు మధ్య నడిచే ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు మంగళవారం తెల్లవారు జామున కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ వృద్ధ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీఎస్‌ఆర్టీసీ కర్నూలు-1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సోమవారం రాత్రి కర్నూలు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 12:30 సమయంలో బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై చిక్కబళ్లాపూర్ జిల్లా దొడ్డపైలగుర్కి సమీపానికి చేరుకోగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు వేగంగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లక్ష్మణ్ (52) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బెంగళూరులోని కల్యాణ్‌నగర్‌కు చెందిన ప్రయాణికుడు ఉమాకాంత్ రావు (77) కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహం

ప్రమాద తీవ్రతకు డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ లక్ష్మణ్ శరీరం క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు భారీ క్రేన్‌ను రంగంలోకి దించారు. బస్సు ముందు భాగాన్ని కట్ చేసి, శకలాలను తొలగించిన అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరోవైపు ప్రయాణికుడు ఉమాకాంత్ రావు మృతదేహాన్ని బస్సు కిటికీ ద్వారా వెలికితీశారు.

ప్రయాణికుల ఆర్తనాదాలతో కల్లోలం

ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కిటికీల అద్దాలు పగిలిపోవడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహకరించారు.

పోలీసుల సహాయక చర్యలు

సమాచారం అందుకున్న పెరేసంద్ర పోలీసులు, అత్యవసర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.