- సీనియర్ కమాండర్ సహా 11 మంది లొంగుబాటు
మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌కు చెందిన కీలక కమాండర్ సహా 11 మంది మావోయిస్టులు శుక్రవారం మహారాష్ట్ర గోండియా జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటు నాగపూర్‌లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో గడ్చిరోలి రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ సమక్షంలో జరిగింది.
లొంగిన వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అనంత్ అలియాస్ వికాస్ (అసలు పేరు వినోద్ సయ్యన్నా) ఉన్నారు. రమేష్ సయ్యన్నా, భాస్కర్ లింగవ్యా, రామస్వామి వంటి పలు పేర్లతో అతడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంఎంసి జోన్ నుంచి ఇటీవల లొంగిపోయిన వారిలో అనంత్ అత్యంత ప్రభావవంతమైన నాయకుడని పోలీసులు తెలిపారు.
మావోయిస్టులు పెద్ద మొత్తంలో ఆయుధాలను అప్పగించారు. AK-47 రైఫిల్, SLR, INSAS రైఫిల్‌కి మేగజైన్లు, రౌండ్లు, .303 రైఫిల్, సింగిల్-షాట్ ఫైరార్మ్స్, డెటొనేటర్లు వంటి ఆయుధాలతో మావోయిస్టులు లొంగపోయారు. ఈ ఆయుధాలను ఫరెన్సిక్ విశ్లేషణ కోసం పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.
లొంగిన 11 మంది మావోయిస్టులపై మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 89 లక్షల బహుమతులు ప్రకటించగా, వీరిలో పలువురిపై రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రివార్డులు ఉన్నాయి. గోండియా–బాలాఘాట్–రాజ్‌నందగావ్ అటవీ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా చురుకుగా ఉన్న డివిజనల్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు… అనంత్ స్క్వాడ్ సభ్యులుగా వీరు పనిచేసినట్లు పోలీసులు వివరించారు.
2005లో అమల్లోకి వచ్చిన మహారాష్ట్ర రాష్ట్ర పునరావాస విధానం సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సహాయం, జీవనాధార మద్దతు, సమాజంలో పునఃప్రవేశానికి ప్రత్యేక కార్యక్రమాలు వంటి అంశాలు ఈ విధానంలో భాగంగా ఉన్నాయి. ఇప్పటి వరకు గోండియా జిల్లా పోలీసుల ఎదుట మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
MMC జోన్‌లో మావోయిస్టుల ప్రభావంపై తాజా లొంగుబాటు పెద్ద దెబ్బగా మారిందని, వారి కదలికలు, నియామక శక్తి బలహీనపడే అవకాశముందని గడ్చిరోలి రేంజ్ DIG అంకిత్ గోయల్ అన్నారు. లొంగిన మావోయిస్టులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పునరావాస ప్రక్రియలోకి ప్రవేశించనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

