నిప్పురవ్వలతో బూడిదైన మామిడి తోట

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ ; మండలంలోని మాటేడు (బొంతుపల్లి) శివారులో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుని 20 ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతైంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్బోయిన విజయ, వెంకన్నలకు చెందిన మామిడి తోటలో మంటలు చెలరేగడంతో చేతికి అందిన మామిడి పంట పూర్తిగా దగ్ధమైంది. మామిడికాయలు బూడిద కావడంతో భారీ పంట నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.
16 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి పెంచుకున్న మామిడి తోట పక్కనే ఉన్న వరి పంట అవశేషాలను కాల్చడంతో వచ్చిన నిప్పురవ్వలు తోటపై పడి మంటలు వ్యాపించాయని వారు తెలిపారు. ఈ ఘటనలో తమకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇటీవలే పంట అవశేషాలను తగలబెట్టవద్దని తొర్రూర్ వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి రైతులకు సూచించినప్పటికీ, అవగాహన లేక కొందరు రైతులు అవశేషాలను కాల్చడం వల్ల ఇతర పంటలకు నష్టం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట అవశేషాలను తగలబెట్టకుండా రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
