శివకాశీపురం విషాదం.. విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి..
- బట్టలు ఆరేస్తూ ప్రాణాలు కోల్పోయిన బాలిక
- ఆశ్రమ పాఠశాలలో భద్రతా లోపాలా?..
- విద్యార్థిని మృతిపై ఆందోళన
- రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి..
- బాధిత కుటుంబానికి ఆదివాసి సంఘాల డిమాండ్
వేలేరుపాడు, ఆంధ్రప్రభ : లూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. వసతి గృహంలో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని కేచ్చేల లక్ష్మిపార్వతి (13) కిటికీపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.
ఒక్కసారిగా కుప్పకూలిన ఆమెను తోటి విద్యార్థినులు గమనించడంతో సిబ్బంది వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.
రాస్తారోకోతో నిరసన..
ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు.
ఘటనపై స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) తక్షణ సాయంగా అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అయితే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, ఐదు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు.
