ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవ
- నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీలు అందజేత
- ముగ్గురు బాధితులకు రూ.14 లక్షలకు పైగా వైద్య సాయం
భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు, టీడీపీ యువనేత సాహుల్ ఖాన్, కూటమి నాయకులతో కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్‌ఓసీ పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా 51వ డివిజన్ కుమ్మరి వీధికి చెందిన బ్రహ్మదేవు లక్ష్మీనారాయణమ్మ (80) హృద్రోగ చికిత్స కోసం మంజూరైన రూ.4.90 లక్షల విలువైన ఎల్‌ఓసీని అందజేశారు. అలాగే 52వ డివిజన్ మాకినవారి వీధికి చెందిన మన్నెల లక్ష్మి (50) గర్భాశయ సంబంధిత వ్యాధి చికిత్స కోసం మంజూరైన రూ.4.33 లక్షల ఎల్‌ఓసీని అందించారు.
అదేవిధంగా 47వ డివిజన్ చిట్టినగర్‌కు చెందిన ఆనంద్ వర్మ హృద్రోగ చికిత్స కోసం మంజూరైన రూ.4.77 లక్షల విలువైన ఎల్‌ఓసీని అందజేశారు. మొత్తం ముగ్గురు బాధితులకు రూ.14 లక్షలకు పైగా వైద్య సాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించారు.
త్వరితగతిన స్పందించి ఎల్‌ఓసీలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు షర్మిళ, రౌతు రమ్యప్రియ, అడ్డూరి భాస్కరరావు, పులిచేరి రమేష్, షేక్ మధు మస్తాన్, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
