పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్ వాహనం.. నలుగురు మృతి
పల్నాడు, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లాలోని మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో పలువురు గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం.. బంధువులు మృతి చెందడంతో తుపాను వాహనంలో పామూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం కలిగించింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి, మృతుల వివరాలు తదితర సమాచారం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
