వర్షం కురవాలని కృష్ణానది జలాలతో అంజన్నకు జలాభిషేకం

ఊట్కూర్, ఆంధ్రప్రభ వర్షాభావంతో రైతులు సాగు చేసిన పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలు ఎండుముఖం పడుతుండటంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి, పగిడిమరి గ్రామాల రైతులు, ప్రజలు శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఆయా గ్రామాల్లోని అంజన్న దేవాలయాల్లో స్వామివారికి జలాభిషేకం నిర్వహిస్తూ మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు.ఈ సందర్భంగా మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, పగిడిమరి సర్పంచ్ మహమ్మద్ జాఫర్ మాట్లాడుతూ, వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రకృతి అనుకూలించి త్వరలోనే మంచి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతుల కష్టాలు తొలగి పంటలు పుష్కలంగా పండాలని అంజన్న స్వామిని ప్రార్థించామని చెప్పారు. ప్రజలంతా ప్రకృతిని పరిరక్షిస్తూ మొక్కలు నాటాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.