బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి రమేష్
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆస్పత్రి బలోపేతం, రహదారులు, డ్రైనేజీలకు నిధులు కోరుతూ వినతి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. అలాగే బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించి వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
పట్టణంలో అంతర్గత రహదారుల విస్తరణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు మురికి కాలువల నిర్మాణం, పాత డ్రైనేజీల పునరుద్ధరణకు కూడా నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు చైర్పర్సన్ స్వాతి రమేష్ తెలిపారు.
అదేవిధంగా సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలకు జీవో నెం.76 ప్రకారం ఇంటి స్థలాల పట్టాలు అందించాలని, కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఇంటి నంబర్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.
ఈ వినతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు చైర్పర్సన్ స్వాతి రమేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఆయన కుమార్తె వర్ష తదితరులు పాల్గొన్నారు.
