ఇంట్లో ఉరివేసుకుని ఒంటరి మహిళ ఆత్మహత్య
నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన వెలుమల జయ (56) కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగించేది. ఆమె తన ఇంట్లో లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుని, రేకుల షెడ్డు వద్ద ఉన్న ఇనుప రాడుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గురువారం మధ్యాహ్నం ఆమె తమ్ముడి కుమార్తె సింధుజ ఇంటికి వెళ్లగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లింది. అక్కడ జయ ఉరివేసుకుని మృతదేహంగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జయ ఒంటరిగా ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగించేదని గ్రామస్థులు తెలిపారు.
మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.
