ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరగడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా, సులభంగా లభించింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించే విధానాన్ని అమలు చేశారు.
లైన్లలోనే చల్లని తాగునీరు అందించడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదానం పంపిణీ చేపట్టి భక్తులకు ఉపశమనం కల్పించారు.మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఆలయ యంత్రాంగం సమన్వయంతో సేవలు కొనసాగించింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏసీ రంగారావు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి క్యూ లైన్లలో స్వయంగా పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. దేవస్థానం అధికారులు కల్పించిన సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
