వ్యర్ధాల ప్రాసెసింగ్‌కు స్థలం సిద్ధం చేయాలి

వ్యర్ధాల ప్రాసెసింగ్‌కు స్థలం సిద్ధం చేయాలి

జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: భీమవరం మండలం తాడేరులో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ (సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్) కొరకు స్థలాన్ని సిద్ధంచేసి పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం తాడేరు గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కొరకు సమీకరించిన 6.6 ఎకరాల స్థలాని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పనికిరాని ఘన వ్యర్థాలను సేకరించి, వాటిని పర్యావరణానికి హాని కలగకుండా శుద్ధి చేసిన అనంతరం వచ్చిన రద్దును ఉంచే ప్రక్రియ నిర్వహణకు స్థలాన్ని సిద్ధం చేయాలని అన్నారు.

స్థలాన్ని వినియోగంలోనికి తెచ్చే విధంగా స్థలాన్ని శుభ్రం చేసి లెవెలింగ్ చేసి, అనంతరం మట్టితో మెరక చేయాలని మండల తహసిల్దార్ రావి రాంబాబును ఆదేశించారు. స్థలానికి సమీపంలో ఉన్న చెరువు నుంచి వచ్చే నీరు స్థలంలోకి చేరి బురదగా ఉండడం వలన దాన్ని పూర్తిగా అరికట్టాలని అన్నారు. పట్టణ పరిధిలో ఏ చెరువులు వద్ద మట్టి అందుబాటులో ఉన్నదో పరిశీలించి వెంటనే పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ పనులన్నీ వర్షాకాలంలోపులోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పబ్లిక్ హెల్త్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పనులు వేగవంతం చేయాలని తెలియజేశారు.

ఈ కేంద్రం వినియోగంలోనికి వస్తే ఇళ్లు, పరిశ్రమలు మరియు వాణిజ్య ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా విభజించి తడిచెత్తను సేంద్రీయ ఎరువుగా, పొడి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు, ఐరన్ తదితర వస్తువులను వేరుచేయడం జరుగుతుందని అన్నారు. రీసైక్లింగ్ ప్రాసెసింగ్ ద్వారా వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చడం, రీసైకిల్ కాని చెత్తను పర్యావరణ నిబంధనల ప్రకారం సురక్షితమైన ల్యాండ్ ఫిల్స్ లో పూడ్చిపెట్టడం జరుగుతుందన్నారు. ఘన వ్యర్థాలను సేకరించడం, శుద్ధి చేయడం మరియు పారవేసే పూర్తి ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు పనులన్నీ పారదర్శకంగా, వేగవంతంగా అన్ని శాఖల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మండల తహసిల్దార్ రావి రాంబాబు, పబ్లిక్ హెల్త్ డి.ఇ ఆర్.విజయ్, పట్టణ ప్లానింగ్ అధికారి పార్థసారథి, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply