కడెం మండలంలో విషాదం..

కడెం,ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన జవిలాల్ అనే వ్యక్తి కూలి పని నిమిత్తం వచ్చి, ఈ నెల 24న వడదెబ్బ తగిలి మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే కడం పెద్దూర్ గ్రామ సర్పంచ్ కొండా విజయ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కడం ఎస్సై సాయి కిరణ్‌కు సమాచారం అందించగా, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్‌లో భద్రపరచి, బంధువుల ఆచూకీ కోసం ఎదురు చూశారు. అయితే మృతుని బంధువులు లభించకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఈ నెల 27న కడం గ్రామంలో స్థానిక సాంప్రదాయాల ప్రకారం గ్రామ సర్పంచ్ కొండా విజయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ క్లిష్ట సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి సహకరించిన కడం పెద్దూర్ గ్రామ సర్పంచ్ కొండా విజయ్ కుమార్ సేవాభావం ప్రశంసనీయమని ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, సామాజిక సేవకులు ముబారక్ బీన్ మొహమ్మద్, చింతకుంట రాము, కిట్టు, ఎండి హసీబ్, జీపీ కారోబార్ సయ్యద్ మోసిన్, గ్రామ పంచాయతీ సిబ్బంది గోవింద్ తదితరులు పేర్కొన్నారు.

“మనిషికి మనిషిగా అండగా నిలవడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదు” అని పలువురు గ్రామస్తులు పేర్కొంటూ, వారి మానవత్వం మరియు సేవా దృక్పథం గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.