ముధోల్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు…

ముధోల్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన ముధోల్ లో గురువారం ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ…త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా స్వార్థం, ద్వేషాలకు అతీతంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాన గుణం, సేవాగుణం అలవర్చుకోవాలని చెప్పారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. బక్రీద్ విశిష్టతలో భాగమైన ఖుర్బానీ ని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు.
