ప్రజా ఫిర్యాదులకు చట్టబద్ధంగా న్యాయం
పబ్లిక్ గ్రీవెన్స్ వేదికకు 121 ఫిర్యాదులు
ఉద్యోగాలు, భూ వివాదాలు, మోసాలపై భారీగా వినతులు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో డీఎస్పీ రాఘవేంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన డీఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి మొత్తం 121 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు రూ.38 వేల జీతంతో స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రవల్లి వేణు రూ.5.50 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కర్నూలు శ్రీరాంనగర్‌కు చెందిన సుప్రియ ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా రైల్వే శాఖలో 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని కల్లూరుకు చెందిన గోవిందు కోరారు. గూడూరు మండలం నాగలాపురానికి చెందిన మద్దిలేటి, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.60 లక్షలు తీసుకున్న మహిళ తనను మోసం చేసిందని ఫిర్యాదు చేశారు.
భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా అధికంగా నమోదయ్యాయి. దేవనకొండ మండలం తెర్నెకల్లుకు చెందిన గిడ్డమ్మ, తమ పొలాన్ని ఆక్రమించుకునేందుకు దాడి చేసి గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కర్నూలు స్వామిరెడ్డి నగర్‌కు చెందిన రామేశ్వరమ్మ, ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి కల్లూరు మండలం ముజఫర్‌నగర్‌కు చెందిన మహబూబ్ రూ.8 లక్షలు తీసుకుని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా సంబంధిత పోలీసు అధికారులకు తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐలు శివశంకర్, పార్థసారథి, రామకృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
