ఉద్యమానికి సిద్ధం కండి.. సమస్యల పరిష్కారమే ధ్యేయం

జూలై 14న కలెక్టరేట్ ముట్టడి..

ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఫ్యాప్టో పిలుపు

నంద్యాల, ఆంధ్రప్రభ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న నిర్వహించే ర్యాలీ, పికెటింగ్‌ను విజయవంతం చేయాలని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ మేకల రామచంద్రరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాలలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి నంద్యాల, మహానంది, పాణ్యం, సిరివెళ్ల, గోస్పాడు, బండి ఆత్మకూరు మండలాల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేకల రామచంద్రరెడ్డి మాట్లాడుతూ, 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 14న జరిగే ర్యాలీ, పికెటింగ్‌లో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉదయం 9 గంటలకు శ్రీనివాస కాంప్లెక్స్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై టెక్కె మీదుగా ఫ్లైఓవర్ వంతెన దాటి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పికెటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ దస్తగిరి బాషా, కె.వి. శివయ్య, శ్రీనివాసులు, అరవింద్ కుమార్, రవికుమార్, దీపక్ కుమార్, సుబ్బారెడ్డి, వెంకటరామిరెడ్డి, మధుసూదన్, యూనస్, జానీ బాషా, ఆదినారాయణ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.