17 ఏళ్ల తర్వాత… భారత్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ !!
- అభిమానులకు ఇక పండుగే
- ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రపంచ షట్లర్ల సందడి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నీల్లో ఒకటైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్-2026కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. 2009లో హైదరాబాద్‌లో నిర్వహించిన తర్వాత.. దాదాపు 17 ఏళ్లకు మళ్లీ ఈ టోర్నీ భారత్‌కు రావడం విశేషం.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు టికెట్ల విక్రయాలను బుక్‌మైషో ద్వారా నిర్వహించనున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) ప్రకటించింది. అభిమానుల కోసం రూ.499 ప్రారంభ ధరతో ఎర్లీ బర్డ్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఆరు ధరల విభాగాల్లో 6 వేలకుపైగా సీట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
రూ.499 టికెట్‌తో పాటు మిగతా ఐదు కేటగిరీల టికెట్లపై పరిమిత కాలానికి 15 శాతం రాయితీ కూడా కల్పిస్తున్నారు. అత్యంత ప్రీమియం విభాగంలో టికెట్ ధర రూ.5,500గా నిర్ణయించారు. టికెట్ల విక్రయాలు దశలవారీగా ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ భారత బ్యాడ్మింటన్ అభిమానులకు మరింత ప్రత్యేకం కానుంది. ఎందుకంటే భారత స్టార్ షట్లర్లు పీ.వి.సింధు, లక్ష్యసేన్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వదేశీ అభిమానుల ముందే పోటీపడనున్నారు.
అంతర్జాతీయంగా మహిళల ప్రపంచ నంబర్-1 ఆన్ సె-యంగ్, చైనా స్టార్‌లు షి యు చీ, లీ షి ఫెంగ్, ఇండోనేషియా డబుల్స్ జోడీ ఫజర్ అల్ఫియన్-ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బీఏఐ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, “బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ న్యూఢిల్లీలో జరగడం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మైలురాయి. ఈ క్రీడ ఎదుగుదలకు తోడ్పడిన అభిమానులకు ఇది గొప్ప అవకాశం” అని పేర్కొన్నారు.
కాగా, 2011 నుంచి ప్రతి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ కనీసం ఒక పతకం సాధిస్తూ వస్తోంది. ఈసారి స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో భారత షట్లర్లు మరింత మెరుగైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
