సింగిల్ విండో చైర్మన్ గా కుంభం క్రాంతికుమార్ రెడ్డి ఎన్నిక

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్‌గా మరోసారి కుంభం క్రాంతికుమార్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏరుకొండ గణపతి బాధ్యతలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పాలకవర్గం తిరిగి బాధ్యతలు స్వీకరించారు.
2025 ఫిబ్రవరి 14తో సింగిల్ విండో కమిటీ పదవీకాలం ముగియగా, ప్రభుత్వం మొదట ఆరు నెలలు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం 2025 ఆగస్టు 14న మరోసారి ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. అయితే మధ్యలోనే 2025 డిసెంబర్ 19న పాలకవర్గాన్ని తొలగిస్తూ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు చైర్మన్లు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తిరిగి పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా డైరెక్టర్లుగా పోరెడ్డి సుదర్శన్ రెడ్డి, గుర్రం మహేందర్, పాకాల వనమాల వీరారెడ్డి, అజ్మీరా రాజు నాయక్, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పులి విజేందర్ రెడ్డి, పిన్నింటి విజేందర్ రెడ్డి, దొడ్ల కోటేశ్వర్, గంగాధరి స్వప్న, ఆరేపల్లి మల్లీశ్వరి, కొండ్ర రాజయ్యలు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి మాట్లాడుతూ, “మరికొన్ని రోజులు ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
