గిరిజన యువతికి న్యాయం జరిగేలా చూస్తా
గిరిజన యువతికి న్యాయం జరిగేలా చూస్తా
- ఎర్రబెల్లి, పరుపాటితో కలిసి కుటుంబ సభ్యుల వినతి
- మహేశ్వరి కుటుంబానికి కేటీఆర్ ధైర్యం
రాయపర్తి , ఆంధ్రప్రభ : మండలంలోని ఏకే తండాకు చెందిన గిరిజన యువతి మహేశ్వరి అలియాస్ చిట్టీ (21) అనుమానాస్పద మృతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన చిట్టీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో న్యాయం కోరుతూ మృతురాలి కుటుంబ సభ్యులు బుధవారం హనుమకొండలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరుపాటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ను కలిశారు.
జరిగిన ఘటనను కుటుంబ సభ్యులు వివరిస్తూ కన్నీటి పర్యంతమై, తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.వినతిపత్రం స్వీకరించిన కేటీఆర్ వెంటనే స్పందించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకుని చలించిపోయారు. తక్షణమే సంబంధిత పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిని ఆరా తీశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు.అనంతరం మహేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడిన కేటీఆర్, అధైర్య పడవద్దు.
గిరిజన బిడ్డకు అన్యాయం జరగనివ్వం. న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,గిరిజన యువతి మృతి అత్యంత బాధాకరం. పోలీసులు లోతుగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కేసును వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టి యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ మండల పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
