బడి బాటలో సంబరం.. సమస్యలతో సతమతం!

బడి బాటలో సంబరం.. సమస్యలతో సతమతం!

  • ​ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ డివిజన్ ప్రభుత్వ బడుల్లో సవాళ్ల వెల్లువ
  • ​-రంగులు వెలిసిన భవనాలు.. బిల్లులు రాక నిలిచిన వంట గదుల నిర్మాణాలు
  • ​-కోతుల బెడదతో విద్యార్థుల బెంబేలు.. అస్తవ్యస్తంగా ఉపాధ్యాయుల పునర్విభజన
  • ఆరెగూడెం బడిలో 210 మంది పిల్లలకు.. ఇద్దరే టీచర్లు! దాతల సాయమే దిక్కు
  • ​ రూ.3వేల జీతానికి దొరకని స్కావెంజర్లు..
  • ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు

​చౌటుప్పల్ , ఆంధ్రప్రభ:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ వ్యాప్తంగా “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” (జూన్ 3 నుండి 19 వరకు) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, ఉపాధి హామీ కింద కిచెన్ షెడ్ల మంజూరు, మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపితేనే సర్కారు బడుల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కుదురుతుందని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కేవలం జూన్ నెలలో ర్యాలీలు తీస్తే సరిపోదని, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

​భవనాలకు రంగుల్లేవు..
​డివిజన్ లోని మెజారిటీ పాఠశాలలు సరైన మరమ్మతులు లేక, రంగులు వెలిసిపోయి వెలవెలబోతున్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా స్కూళ్లకు కనీసం సున్నాలు, రంగులు వేయకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు డివిజన్ లో 9 కిచెన్ షెడ్లను మంజూరు చేసినట్లు కాగితాల్లో చూపిస్తున్నా, చాలా గ్రామాల్లో పనులు ముందుకు సాగడం లేదు. గతంలో చేసిన పనులకు ప్రభుత్వ బిల్లులు సకాలంలో రాకపోవడంతో, కొత్తగా వంట గదుల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

మండలంలోని లక్కారం మోడల్ స్కూల్, ఆరెగూడెం ఉన్నత పాఠశాల, లింగారెడ్డిగూడెం, లింగోజీగూడెం, కాట్రేవ్, రెడ్డిబావి గ్రామాలలోని పాఠశాలలలో వంట గదులు లేవు. దీనివల్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణ భారంగా మారుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల మందలు వంట గదులు, పాఠశాల ఆవరణపై పడుతుండటంతో పిల్లలు భోజనం చేయాలంటేనే భయపడుతున్నారు. తరగతి గదుల్లోకి దూరి పుస్తకాలు చింపేస్తున్నా అటవీశాఖ కానీ, పంచాయతీలు కానీ పట్టించుకోవడం లేదు.

​తలకిందులైన ఉపాధ్యాయుల నిష్పత్తి..

  • ఉన్నత పాఠశాలలో 10లోపు విద్యార్థులు ఉన్నా 7కు పైనే ఉపాధ్యాయులు, బడ్జెట్ వృధా
  • ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరే ఉపాధ్యాయులు

​డివిజన్ లో ఉపాధ్యాయుల పోస్టుల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల సంఖ్య పదుల సంఖ్యలో (చాలా తక్కువగా) ఉన్నచోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే, వందలాది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో మాత్రం సింగిల్ డిజిట్ లేదా తక్కువ సంఖ్యలో టీచర్లు ఉంటున్నారు. కొన్ని ఉన్నత పాఠశాలలో 10 లోపు విద్యార్థులు ఉన్నా 7 నుంచి 10 మంది ఉపాధ్యాయులను నియమించి బడ్జెట్ ను వృధా చేయడంతో పాటు ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరే ఉపాధ్యాయులను నియమిస్తూ ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు, అంతేకాకుండా హైస్కూల్లో సబ్జెక్టు టీచర్ రాకపోతే ప్రైమరీ స్కూల్ టీచర్లను తాత్కాలికంగా హైస్కూల్లో విద్యాబోధనకు పంపిస్తున్నారు.

కానీ ప్రైమరీ స్కూల్లో టీచర్ రాకపోతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం లేదు. ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు అధికంగా ఉన్నప్పటికీ ఉన్న టీచర్లు కూడా తమకు అణువుగా ఉండే గ్రామానికి డిప్యూటేషన్ పై వెళుతున్నారు. ఈ అసమతుల్యత వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట సరైన బోధన అందక విద్యాభివృద్ధి దెబ్బతింటోంది. తక్షణమే ఉపాధ్యాయుల పునర్విభజన (రేషనలైజేషన్) చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పక్క పక్క గ్రామాల పాఠశాలలను ఒకే చోటికి ‘క్లబ్’ (మ్యాపింగ్) చేసి, పెద్ద పాఠశాలగా మార్చి, విద్యార్థులకు ఉచిత రవాణా (బస్/ఆటో) సౌకర్యం కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సదరు పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉండే అవకాశం లభిస్తుంది.

​గుడ్డుకు ఇచ్చేది రూ.6.. మార్కెట్లో ధర రూ.7!

​మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు..​ గిట్టుబాటు కాని యూనిట్ కాస్ట్: 10, 20 మంది విద్యార్థులు ఉన్నచోట మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే రూ.6.78 పైసల బిల్లు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. దీంతో నాణ్యమైన భోజనాన్ని వండడానికి వంట కార్మికులు ముందుకు రావడం లేదు.

​మార్కెట్ ధరలకు, సర్కారు బిల్లులకు పొంతన లేదు: గ్రామీణ ప్రాంతాలలో ఏడు రూపాయల కంటే తక్కువకు కోడిగుడ్డు దొరకని పరిస్థితి ఉంటే.. ప్రభుత్వం చెల్లిస్తుంది కేవలం ఆరు రూపాయలు మాత్రమే. మిగిలిన భారాన్ని కార్మికులే మోయాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనానికి చెల్లించే బిల్లుల యూనిట్ కాస్ట్ ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

​రాగిజావకు అదనపు బిల్లులు లేవు..

రెండు రోజులకు ఒకసారి విద్యార్థులకు సరఫరా చేసే రాగిజావ కు సంబంధించి వంట కార్మికులకు ఎటువంటి అదనపు బిల్లులు చెల్లించడం లేదు. వారానికి మూడు రోజులు రాగిజావ ఇస్తున్నట్లు చెప్తున్నా, గత విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభమైన రెండు నెలల తర్వాత ప్రారంభించారు. అది కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కొన్ని సందర్భాలలో నెలకు నాలుగు రోజులకు మాత్రమే పరిమితం చేశారు.

​హార్లిక్స్ బంద్.. రాగిజావ సగం!

చౌటుప్పల్ మండలంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు గతంలో ‘దివిస్ లాబరేటరీ’ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతి రోజు పౌష్టికాహారం అందజేయుటకు గాను ప్రతి విద్యార్థికి ఒక్కొక్క హార్లిక్స్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం స్వచ్చంద సంస్థ సహకారంతో ప్రభుత్వం రాగిజావ అందిస్తున్నామనే సాకుతో గత రెండు సంవత్సరాలుగా హార్లిక్స్ ప్యాకెట్ల పంపిణీని నిలిపివేశారు.

రాగి జావతో సంబంధం లేకుండా ప్రతిరోజు విద్యార్థులకు హార్లిక్స్ అందజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతిరోజు విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందజేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ.. దానికి సంబంధించి వంట కార్మికులకు చెల్లించాల్సిన ఖర్చులు, విధివిధానాలు నేటికీ ప్రకటించకపోవడం గమనార్హం.

​రూ.3వేల జీతానికి స్కావెంజర్లు దొరికేదెలా?

​పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుటకు గాను ప్రస్తుతం స్కావెంజర్లను నియమించుకొనుటకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ మూడు వేల రూపాయలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల దగ్గర ఉండి పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కరువు పనికి వెళ్తే కూడా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తున్నారు. నెల రోజులకు ఇచ్చే రూ. 3 వేల జీతం ఏమాత్రం గిట్టుబాటు కాదని స్కావెంజర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాఠశాలల్లో పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది.

210 మంది పిల్లలు.. ఇద్దరే టీచర్లు!


చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ పాఠశాలలో ఎల్ కేజీ, యూకేజీ తో పాటు 1 నుండి 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎల్ కేజీ, యూకేజీ కలిపి సుమారు 40 మంది ఉండగా, ఒకటి నుండి ఐదో తరగతి వరకు 170 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం కలిపి 210 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో విద్యాబోధన చేయడం కోసం కేవలం ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే ప్రభుత్వం నియమించింది.

​ఐదు తరగతులకు (ప్లస్ ఎల్ కేజీ, యూకేజీ) ఇద్దరే ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బోధన చేయగలుగుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, చదువుకునే ఆసక్తి బాగున్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకొని, దాతల సహకారంతో ప్రైవేటుగా టీచర్లను ఏర్పాటు చేసుకొని విద్యా బోధన కొనసాగిస్తున్నారు.

మండలంలోని ఆరెగూడెం, మల్కాపురం, పంతంగి, జై కేసారం, పీపల్ పాహాడ్ గ్రామాలలోని ఫ్రీ ప్రైమరీ పాఠశాలలకు తాత్కాలిక ప్రాతిపదికన ఇన్స్ట్రక్టర్, ఆయా లను నియమించడం జరుగుతుందని ఎంఈఓ గురువారావు తెలిపారు. కాగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ చొప్పున నియమించి, మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply