Kavitha | 1200 ఉద్యోగాలు ఇవ్వకపోతే దీక్ష

Kavitha | 1200 ఉద్యోగాలు ఇవ్వకపోతే దీక్ష

సింగరేణిపై కవిత అల్టిమేటం

Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సింగరేణి సంస్థలో మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న 1200 మంది కార్మిక కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక నెలలోగా చర్యలు తీసుకోకపోతే జూలై 20 నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

శనివారం కేటీకే-5 ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడుతోందని, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యమ కాలం నుంచి సింగరేణి కార్మికులతో కలిసి పనిచేస్తున్నానని, తెలంగాణ రక్షణ సేనకు కార్మికులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

సింగరేణిలో కార్మికులకు కనీస అవసరాలైన స్వచ్ఛమైన నీరు, గాలి కూడా అందడం లేదని విమర్శించారు. నాసిరకం డిటోనేటర్ల వినియోగం వల్లే ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కార్మికులు గాయపడుతున్నారని అన్నారు. కార్మికులను విజిలెన్స్ విచారణల పేరుతో వేధించవద్దని, మెమోలు జారీ చేసి ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు సూచించారు.

మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసిన 1200 మందిని వెంటనే పిలిచి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత.. ఇందుకు ప్రభుత్వం స్పందించకపోతే జూలై 20 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. అలాగే కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, సింగరేణికి ప్రత్యేక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసి రిటైర్డ్ కార్మికులకు గృహ సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదించారు. కార్మికుల సంక్షేమం, భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.