Jainoor | నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..

Jainoor | నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..

  • ఉచిత నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సహకారంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు హైదరాబాద్‌లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ, వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.

డ్రైవాల్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ టెక్నీషియన్, ఆటోమొబైల్ అండ్ టూవీలర్ టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎక్స్కవేటర్ ఆపరేటర్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ (ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (యువతులకు మాత్రమే) వంటి కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తైన అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

అభ్యర్థులు ఆధార్ కార్డు మూడు ప్రతులు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. జూన్ 9న జైనూర్, సిర్పూర్-యు, లింగాపూర్ మండలాల అభ్యర్థులకు జైనూర్‌లోని కేఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో, కెరమెరి మండల అభ్యర్థులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే జూన్ 10న తిర్యాణి మండల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత కోరారు.