రూ.2 కోట్లతో రిసోర్స్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ

రూ.2 కోట్లతో రిసోర్స్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ (డీపీఆర్‌సీ) భవన నిర్మాణానికి మంగళవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కూటమి నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ఈ రిసోర్స్ సెంటర్ కీలకంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు.

పంచాయతీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, గ్రామ స్థాయి పరిపాలనకు సంబంధించిన సాంకేతిక సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న డీపీఆర్‌సీ భవనం ద్వారా జిల్లాలోని పంచాయతీలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని చెప్పారు.

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమర్థ అమలుకు ఇటువంటి కేంద్రాలు ఎంతో అవసరమన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూమిపూజ అనంతరం అధికారులు నిర్మాణ పనుల ప్రణాళికపై సమీక్ష నిర్వహించి, పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply