Jyothi Yarraji | ట్రెండింగ్ లో మన హర్డిల్ జింక !! ఎందుకు ?
Jyothi Yarraji | ట్రెండింగ్ లో మన హర్డిల్ జింక !! ఎందుకు ?
- గంతులే.. గంతులు
- వాన అడ్డొచ్చినా.. ఆగని జ్యోతి
- నెట్టింట వీడియో వైరల్
ఆంధ్రప్రభ : అథ్లెట్, హర్డిల్ క్వీన్, ఆంధ్ర ముద్దు బిడ్డ జ్యోతి యర్రాజీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో జ్యోతి యర్రాజీ సరికొత్త రికార్డుతో స్వర్ణ పతకాన్ని ముద్దాడి నెలలు గడుస్తోంది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె గెలిచిన క్షణాలకు సంబంధించిన వీడియోలు, పోడియంపై ఆమె నిలబడిన దృశ్యాలు మరోసారి వైరల్ గా మారాయి.
అయితే, నెటిజన్లు ఇప్పుడు ఈ వీడియోలను షేర్ చేస్తోంది కేవలం ఆమెకు మెడల్ వచ్చిందని సంబరపడటానికి మాత్రమే కాదు.. ఆ విజయం వెనుక ఉన్న ఒక చేదు నిజం చూసి చలించిపోతున్నారు. అసలు ఆ సమయంలో స్టేడియంలో ఏం జరిగింది? అగ్రరాజ్యాల అథ్లెట్లను వెనక్కి నెట్టి జ్యోతి సాధించిన ఆ రికార్డు విజయం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు ఎందుకు దారితీసింది?
మన దేశంలో స్పోర్ట్స్ కి మంచి ఆదరణ ఉంది. అయితే, ఆ ఆదరణ అంతా కేవలం ‘క్రికెట్’ అనే మంత్రం చుట్టూనే తిరుగుతోంది. క్రికెట్లో ఒక బ్యాటర్ సిక్స్ కొడితే వచ్చే హైప్, స్టేడియంలో హోరెత్తే కేరింతలు.. దేశం కోసం చెమట చిందించి స్వర్ణ పతకాలు తెచ్చే అథ్లెట్లకు దక్కడం లేదన్నది కాదనలేని వాస్తవం. ఇక్కడ క్రికెట్‌ను తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కానీ ఒక క్రీడాకారుడికి “వాళ్లు దేశం కోసం పోరాడుతున్నాం” అనే స్ఫూర్తి కలగాలంటే, ఆ దేశం నుంచి వారికి తగిన సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉండాలి.
ఇది కూడా చదవండి : Women’s Cricket | దేశవాళీ ప్లేయర్లపై కాసుల వర్షం !!
అయితే, ఆ గుర్తింపు లేకపోయినా, ప్రేక్షకులు కేరింతలు లేకపోయినా.. నిశ్శబ్దంగా దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్న పోరాట యోధులు మన అథ్లెట్లు. ఆ కోవలోకే వస్తుంది తెలుగింటి క్రీడారత్నం… అథ్లెటిక్స్ సంచలనం జ్యోతి యర్రాజీ (Jyothi Yarraji).

ప్రతికూల పరిస్థితుల్లో జ్యోతి గెలుపు..
ఈ ఏడాది (2025) దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇప్పుడు ఒక భావోద్వేగ చర్చకు దారితీసింది. 2025 మే 29న జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆ రోజు గుమి స్టేడియం భారీ వర్షంలో తడిసిముద్దవుతోంది. వాతావరణం అనుకూలించక ప్రేక్షకులందరూ వెళ్ళిపోయారు.. గ్యాలరీలు ఖాళీగా ఉన్నాయి.

వర్షం కారణంగా ప్రేక్షకులు ఎవరూ లేకపోయినా, పోటీ ఆగలేదు. జ్యోతి వెనకడుగు వేయలేదు. జపాన్‌కు చెందిన యుమి తనకా, చైనాకు చెందిన యాని వు ప్రారంభంలో వేగంగా దూసుకెళ్లినప్పటికీ, జ్యోతి ఏమాత్రం తడబడలేదు. గడియారంతో పోటీ పడుతూ.. గాలి వేగాన్ని సైతం వెనక్కి నెడుతూ, కేవలం 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ క్రమంలో ఆమె తన ఆసియా టైటిల్‌ను కాపాడుకోవడమే కాకుండా, సరికొత్త ఛాంపియన్షిప్ రికార్డును నెలకొల్పింది. ఇక, 2026 టోక్యో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై కన్నేసిన జ్యోతి, ఇప్పుడు లక్షలాది మంది గ్రామీణ యువతులకు స్ఫూర్తిప్రదాతగా మారింది.
Jyothi Yarraji | నిశ్శబ్ద పోరాటం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో జ్యోతి విజయం ట్రెండింగ్‌లో వైరల్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం.. ఆమె గెలిచిన తీరు కంటే, ఆ విజయం సాధించిన పరిస్థితులు. వర్షంలో తడుస్తూ, నిశ్శబ్ధ స్టేడియంలో ఆమె సాధించిన ఈ ఘనతను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. క్రికెట్ సాధించే విజయాల కంటే ఇవేమీ తక్కువ కాదు.. అంటూ అథ్లెటిక్స్‌కు సరైన గుర్తింపు దక్కడం లేదనే చర్చ మొదలైంది.
మరుమూల గ్రామం నుంచి ఆసియా క్వీన్ వరకు..
విశాఖపట్నం సమీపంలోని ఒక సామాన్య మారుమూల గ్రామం నుంచి మొదలైన జ్యోతి ప్రయాణం పూల బాట కాదు. ఆర్థిక ఇబ్బందులు, మౌలిక సదుపాయాల లేమి.. ఇలా ఎన్నో అడ్డంకులను హర్డిల్స్ లాగే దాటుకుంటూ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్, కోచ్ జేమ్స్ హిల్లియర్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి చేర్చింది.
2025 ఆసియా అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి సాధించిన స్వర్ణం, హైజంపర్ తేజస్విన్ శంకర్ సాధించిన కాంస్యంతో భారత్ మెడల్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆర్భాటాలు లేని చోట ఆమె సాధించిన ఈ విజయం, కేవలం ఒక పతకం మాత్రమే కాదు.. అది ఒక అథ్లెట్ అచంచలమైన క్రమశిక్షణకు, పట్టుదలకు నిదర్శనం అంటున్నారు నేటిజన్లు.
సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్!
ప్రస్తుతం ఇంటర్నెట్లో జ్యోతి వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే రోడ్లపైకి వచ్చి రచ్చ చేసే మనం, దేశం కోసం పోరాడిన ఈ ఆడబిడ్డను ఎందుకు పట్టించుకోలేదు?” అని కొందరు ప్రశ్నిస్తుంటే.. “స్టేడియం ఖాళీగా ఉన్నా తన దేశం కోసం గెలిచిన జ్యోతి అసలైన ఛాంపియన్” అంటూ మరికొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

