కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు..
కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు..
నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రకటించిన జిల్లా, మండల స్థాయి కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 14 డీసీసీ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ నార్సింగి మండలానికి సంబంధించిన నియామకాలలో సామాజిక సమతౌల్యం పాటించలేదని విమర్శించారు.
ఇతర మండలాల్లో అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించగా, ఇక్కడ మాత్రం కొన్ని వర్గాలకే పదవులు పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు. పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల నాయకులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం అవసరమని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన యువ నాయకులను పక్కన పెట్టడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.
ఇదే విధంగా కొనసాగితే క్షేత్ర స్థాయిలో అసంతృప్తి పెరిగి, పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికైనా పార్టీ ఉన్నతాధికారులు స్పందించి, సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే ఎన్నికలపై దీని ప్రభావం తప్పదని స్పష్టం చేస్తున్నారు.
